అన్ లక్కీ షర్ట్' లఘు చిత్ర దర్శకుడు సురంజన్ దే కు ఘన సత్కారం
విశాఖపట్నం : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు నామినేట్ పొందిన 'అన్ లక్కీ షర్ట్' లఘు చిత్ర దర్శకుడు సురంజన్ దే ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (ఎఫ్.టి.పి.సి) సభ్యులు ఆదివారం ఉదయం రామ్ నగర్ లోని దసపల్లా ఎగ్జిక్యూటివ్ కోర్టులో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు సురంజన్ దే మాట్లాడుతూ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చేపట్టే దేశ వ్యాప్త కార్యక్రమాలకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని తెలిపారు. త్వరలో పశ్చిమ బెంగాల్ లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన సాంకేతికతను వినియోగించుకుంటామని అన్నారు. బాలీవుడ్ నటీమణి శుభశ్రీ కర్ మాట్లాడుతూ దేశ విదేశాల్లోని ఏ లొకేషన్ కు తీసిపోని రీతిలో విశాఖలో అనేక లొకేషన్లు ఉన్నాయని అన్నారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా తనవంతు ప్రమోషన్ ను అందిస్తానని ఆమె వెల్లడించారు. ఎఫ్. టి. పి. సి అధ్యక్షుడు చైతన్య జంగా మాట్లాడుతూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన సురంజన్ దే తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. త్వరలో వారితో రిలేషన్ షిప్ ను రీసెర్చ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జాతీయ స్థాయిలో తెలుగు, హిందీ, బెంగాలీ భాషలలో చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. వ్యాపారవేత్త అల్లు నరేష్ ను ఎఫ్. టి. పి. సి. హాస్పిటాలిటీ కమిటీ కో ఆర్డినేటర్ గా నియమించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్. టి. పి. సి. ప్రధాన కార్యదర్శి వీఎస్. విజయవర్మ పాకాలపాటి, ఎఫ్. టి. పి. సి. హాస్పిటాలిటీ కమిటీ కో ఆర్డినేటర్ అల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు.